kakatiya Posted Thursday at 03:18 PM Report Posted Thursday at 03:18 PM ‘నూటొక్క జిల్లాల అందగాడు’గా నూతన్ ప్రసాద్ పండించిన వినోదాన్ని తెలుగు వారు అంత సులువుగా మరచిపోలేరు.నూతన్ ప్రసాద్ మాట, ఆట, నటన అన్నీ ఒకానొక సమయంలో ప్రేక్షకులను కిర్రెక్కించాయి. ఆయన నోట వెలువడిన మాటలు తూటల్లా జనం నోళ్ళలో పేలేవి. ఆయన విలనీ, కామెడీ, ట్రాజెడీ, సెంటిమెంట్ అన్నీ కూడా ఇట్టే ఆకట్టుకొనేవి.తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న అలనాటి మేటి నటులలో నూతన్ ప్రసాద్ ఒకరు. నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణాజిల్లా కైకలూరులో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ ఆయనకు ఇతరులను అనుకరిస్తూ వినోదం పంచడం అలవాటు. దాంతో చుట్టూ మిత్రులను పోగేసుకొని, నాటకాలు ఆడడం మొదలెట్టారు. నాటకాలపై ఆసక్తితో ఆయన మన రామాయణ, భారత, భాగవత గాథలను భట్టీయం వేశారు. అప్పట్లో మేటి రంగమార్తాండుల ఫక్కీలో పద్యాలు పాడడం మొదలెట్టారు. అలా పురాణజ్ఙానం వంటపట్టింది. నాటకాల్లో అలవోకగా నటించడం మొదలయింది. ‘నావూరు’ అనే నాటికలో నూతన్ ప్రసాద్ అభినయం ఎంతోమందిని ఆకట్టుకుంది. దాంతో సినిమా రంగంలో రాణించాలనే అభిలాష కలిగింది. బాపు-రమణ తెరకెక్కించిన ‘అందాల రాముడు’తో నూతన్ ప్రసాద్ తెరకు పరిచయం అయ్యారు. అప్పుడే ఆయన పేరులో ముందు ‘నూతన్’ చేరింది. ఆ తరువాత బాపు ‘ముత్యాల ముగ్గు’లో గుర్తింపు ఉన్న పాత్ర సంపాదించారు. ‘ప్రాణం ఖరీదు’లో మునుసబు బుల్లెబ్బాయిగా భలేగా ఆకట్టుకున్నారు. ‘చలిచీమలు’, ‘కుడి ఎడమైతే’ చిత్రాలలో నూతన్ ప్రసాద్ డైలాగులు విశేషాదరణ చూరగొన్నాయి. ‘నూటొక్క జిల్లాల అందగాడు’గా జనం మదిలో నిలచిపోయారు. ఆ తరువాత నూతన్ ప్రసాద్ నటించిన ‘కలియుగ భారతం’లో “నవ్వింది ఓ ఆడది నన్ను చూసి నవ్వింది…” అంటూ చెప్పిన డైలాగులు మరింతగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో నూతన్ ప్రసాద్ డైలాగుల కోసమే జనం సినిమాలకు వెళ్ళిన రోజులున్నాయి. ఇక ‘ఇంటింటి రామాయణం’లో హీరోలు రంగనాథ్, చంద్రమోహన్ కు సమానంగా నూతన్ ప్రసాద్ పాత్ర కూడా ఉంది. అందులో ఆయనపై చిత్రీకరించిన పాటలు జనాన్ని కుర్చీల్లో కుదురుగా కూర్చోనీయలేదు. ఆ సినిమా తరువాత నూతన్ ప్రసాద్, రమాప్రభ హిట్ పెయిర్ గా మారిపోయారు. బాపు తెరకెక్కించిన పలు చిత్రాలలో నూతన్ ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తూ మెప్పించారు. బాపు దర్శకత్వంలో రూపొందిన ‘రాజాధిరాజు’లో “కొత్తా దేవుడండీ…” పాటలో నూతన్ ప్రసాద్ నటన, అందులో అతను ధరించిన విలక్షణమైన పాత్ర ఆ సినిమా చూసినవారు ఎప్పటికీ మరచిపోలేరు. విలక్షణ నటుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సుమారు 365 చిత్రాలలో నటించి, వైవిధ్యమైన పాత్రలతో, తన విలక్షణమైన డైలాగ్ డెలివరీతో, తనదైన మేనరిజమ్స్ తో ప్రేక్షకుల హృదయాల్లో నూటొక్క జిల్లాల అందగాడుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమా షూటింగ్ లో కారు ప్రమాదం జరగడంతో నూతన్ ప్రసాద్ వీల్ చైర్‌కే పరిమితమయ్యారు. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి సీనియర్ రాజేంద్ర ప్రసాద్ వివరించారు. 1989లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా 'బామ్మ మాట బంగారు బాట' సినిమా షూటింగ్ లోనే నూతన్ ప్రసాద్ కు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ కూడా అదే కారులో ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆనాడు జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది వివరించారు. ''సినిమా క్లైమాక్స్ లో కారు మందు తాగినట్లు, పైకి కిందికి ఎగిరినట్లు, ఆడినట్లు చూపిస్తారు. రెండు ముక్కలుగా విడిపోయి మళ్ళీ కలిసినట్లు చూపిస్తారు. ఏవీఎం స్టూడియోలో ఆరు కార్లతో ఆ షూటింగ్ చేశాం. రెండు కార్లను రెండు పార్టులుగా చేశారు. వెనక పార్ట్ కి స్కూటర్ ఇంజన్ తగిలించారు. అన్నీ ప్లాన్ చేసి బ్రహ్మాండంగా చేశారు. క్రేన్ కి కార్లు కట్టి మార్నింగ్ నుంచి అటూ ఇటూ ఊపుతూ షూటింగ్ చేశారు. తీసిన షాట్స్ మళ్ళీ తీయాల్సి వచ్చింది. 'డైరెక్టర్ హ్యాపీగా లేరు. ఆ షాట్స్ మరోసారి చేద్దాం' అని నూతన్ ప్రసాదే నా దగ్గరకు వచ్చి చెప్పాడు. నేనూ సరే చేద్దాం అన్నాను. కారును క్రేన్ తో పైకి ఎత్తే టైంలో.. '50 అడుగుల ఎత్తు అవసరం లేదు. ఆపండి' అని కెమెరామెన్ అన్నాడు. సడన్ గా ఆపడంతో గొలుసు తెగిపోయి ఆ కారు 18 అడుగుల ఎత్తు నుంచి అమాంతం కింద పడిపోయింది. అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ లో ఉన్నాను. నూతన్ ప్రసాద్ వెనక సీట్ లో కూర్చొని ఉన్నారు'' ''ఒక్కసారి కింద పడటంతో కారు కప్పలా అయిపోయింది. నేను పక్కకి పడుకోవడంతో నాకేమీ కాలేదు. ఆయన మాత్రం మధ్యలో ఇరుక్కుపోయారు. స్పైనల్ కార్డ్ మధ్యలో రెండు బోన్స్ జామ్ అయ్యాయి. పాపం.. దాని వల్ల రెండు కాళ్ళకు పక్షవాతం వచ్చింది. 'చిన్నోడు నేనూ ఒకేసారి ఒకే కారులో నుండి కింద పడ్డాం.. అతనేమో అలా నేనేమో ఇలా' అని పలు సందర్భాల్లో నూతన్ ప్రసాద్ అన్నారు. అది మన తలరాత అని ఒకటీ రెండుసార్లు చెప్పడానికి ట్రై చేశా. 'నేను ఇలా ఉన్నానంటే భగవంతుడు నాకు ఇంకో నాలుగు రోజులు అవకాశం ఇచ్చినట్లు అంతే.. నువ్వు ఫీల్ అవ్వొద్దు' అని చెబుతూ ఉండేవాడిని. ఆయన చాలా ఏళ్ల పాటు డబ్బింగ్ చెబుతూ, చిన్న చిన్న వేషాలు వేస్తూ బాగానే లాగాడు. యాక్సిడెంట్ కదా.. ఎక్కువకాలం లాగలేకపోయాడు.. వెళ్ళిపోయాడు'' అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నూతన ప్రసాద్ విషయానికొస్తే.. నాటక రంగం పట్ల అమితమైన ఆసక్తి ఉన్న ఆయన, హెచ్‌ఏఎల్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో 'కళారాధన' అనే సంస్థలో చేరారు. 'వలయం', 'గాలివాన', 'కెరటాలు' వంటి నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'మాలపల్లి' నాటకాన్ని 101 సార్లు ప్రదర్శించారు. ఒకే టేక్‌లో పెద్ద పెద్ద డైలాగులు పలికడం చూసి అందరూ షాక్ అయ్యేవారట. ఇదే క్రమంలో బాపు దర్శకత్వం వహించిన 'నీడ లేని ఆడది' (1974) అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసారు. 'చలి చీమలు' (1978) చిత్రంతో నూతన్ ప్రసాద్ అనే పేరు స్థిరపడింది. ఈ చిత్రంలోని "నూటొక్క జిల్లాల అందగాణ్ణి" అని ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో ఆంధ్రదేశం అంతటా మారుమోగి, ఆయనకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. నూతన్ ప్రసాద్ కేవలం హాస్య పాత్రలకే పరిమితం కాకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ పోషించారు. ఆయన సంభాషణలను పలికే విధానం, ఆయన మేనరిజమ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. గంభీరంగా మాట్లాడినా, హాస్యాన్ని పండించినా అందులో ఒక సహజత్వం కనిపిస్తుంది. ఎంతటి క్లిష్టమైన సన్నివేశానికైనా తన నటనతో ప్రాణం పోసి, సన్నివేశాన్ని పండించడంలో దిట్ట. 'పట్నం వచ్చిన పతివ్రతలు' చిత్రంలో ఇన్‌స్పెక్టర్ పాత్రలో ఆయన పలికిన "అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు" అనే డైలాగ్ విశేష ప్రజాదరణ పొందింది. 'బామ్మమాట బంగారుబాట' సినిమా తర్వాత వీల్ చైర్‌కే పరిమితమైనప్పటికీ తన ఆత్మవిశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోలేదు. చక్రాల కుర్చీలో ఉంటూనే పరిమితమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 'సర్దార్ పాపారాయుడు' వంటి చిత్రాలలో కుర్చీలో కూర్చునే తన పాత్రకు ప్రాణం పోశారు. 'హ్యాట్సాఫ్' అనే కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించిన ఆయన... 'నేరాలు - ఘోరాలు' వంటి క్రైమ్ ప్రోగ్రామ్ తో ఆకట్టుకున్నారు. “నవభారతం, ప్రజాస్వామ్యం” చిత్రాల ద్వారా ఉత్తమ విలన్ గా నంది అవార్డును వరుసగా అందుకున్నారు నూతన్ ప్రసాద్. “సుందరి-సుబ్బారావు, వసుంధర” చిత్రాల ద్వారా ఉత్తమ సహాయనటునిగానూ నంది అవార్డులు దక్కించుకున్నారు. యన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 2005లో యన్టీఆర్ అవార్డుతో నూతన్ ప్రసాద్ ను సన్మానించింది. ఆయన చివరగా నటించిన చిత్రాలలో ‘రాజు-మహరాజు’ ఒకటి. 2011 మార్చి 30న ఆయన తుదిశ్వాస విడిచారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.