Jump to content

భువి నుంచి దివికి గోదావరి జలాలు


snoww

Recommended Posts

AndhraJyothy Logo
 

కొండంత విజయం

 

 

 

05292020034724n54.jpg

 

  • భువి నుంచి దివికి గోదావరి జలాలు
  • ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
  • సర్జ్‌పూల్‌ నుంచి రిజర్వాయర్‌కు గోదారమ్మ
  • తెలంగాణలోనే అత్యంత ఎత్తుకు చేరిక
  • చండి, సుదర్శన యాగాలకు ఏర్పాట్లు
  • పాల్గొంటున్న చిన్నజీయర్‌ స్వామి
  • నిర్వాసితులతో సీఎం సహపంక్తి భోజనం
  • వెయ్యి మందికి మాత్రమే ఆహ్వానం
  • 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు

 

సిద్దిపేట, మే 28 (ఆంధ్రజ్యోతి): రివ్వున దూకే గోదావరమ్మ మేడిగడ్డ వద్ద ఆగింది! అక్కడి నుంచి ఎగురుతూ.. దుంకుతూ దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించింది! దాదాపు అర కిలోమీటరు ఎత్తుకు పరవళ్లు తొక్కుతూ సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల శివారులోని సర్జ్‌పూల్‌కు చేరింది! మరొక్క 400 మీటర్ల దూరం మాత్రమే! శుక్రవారం మీట నొక్కడమే తరువాయి! మహా జల ఘట్టం ఆవిష్కృతం కానుంది! మన కళ్ల ముందు అద్భుతం సాక్షాత్కరించనుంది! ముఖ్యమంత్రి కేసీఆర్‌ జల యజ్ఞం ఫలించనుంది! తెలంగాణ ప్రజలకు ‘కొండంత విజయం’ దక్కనుంది! తెలంగాణలోనే అత్యంత ఎత్తయిన కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి జలాలు తరలనున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత సర్జ్‌పూల్‌లోని పంపులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారు. ఆ వెంటనే నీళ్లు కొండపోచమ్మ సాగర్‌ను చేరనున్నాయి! అక్కడి నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే డెలివరీ సిస్టర్న్‌ వద్దకు చినజీయర్‌ స్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ చేరుకుంటారు. గోదావరి జలాలకు జల హారతి పట్టి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌ ద్వారా 2.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనున్నది. హైదరాబాద్‌ మహానగరానికి తాగునీటి సరఫరా చేయడానికీ ఈ నీటిని వినియోగించనున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కొండపోచమ్మ ఆలయ ఆవరణలో చండి, కొండపోచమ్మ సాగర్‌ పంప్‌హౌజ్‌ వద్ద సుదర్శన యాగాలను ప్రారంభిస్తారు. ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో జరిగే చండి యాగంలో పాల్గొన్ని పూర్ణాహుతి సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకుని, పక్కనే ఉన్న ఎర్రవల్లి ఫాంహౌ్‌సకు వెళతారు. తిరిగి 10 గంటలకు కొండపోచమ్మసాగర్‌ పంప్‌హౌజ్‌కు చేరుకుంటారు. ఇక్కడ జరిగే సుదర్శన యాగంలో చినజీయర్‌ స్వామితో కలిసి పాల్గొంటారు. కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన గ్రామాలకు చెందిన నిర్వాసితులతో సీఎం కేసీఆర్‌ సహపంక్తి భోజనం చేస్తారని సమాచారం. వీరితోపాటు అదనంగా మరో వెయ్యి మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 1200 మంది పోలీసులను రంగంలోకి దించారు. కొండపోచమ్మ ఆలయం, రిజర్వాయర్‌తోపాటు సహపంక్తి భోజనం జరిగే చోట పోలీసులు బందోబస్తు చేయనున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా సూచనలు చేశారు. పలుచోట్ల శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

 

గోదారి ఎగిరింది.. తెలంగాణ మురిసింది

05292020035509n10.jpg

 

  • 175 అంతస్తుల ఎత్తుకు భగీరథ యత్నం
  • నాలుగేళ్లలో సాకారం 

 

ఐదంతస్తుల అపార్టుమెంటు! దానిపై ఒకదానిపై మరొకటిగా 35 అపార్టుమెంట్లను పేరిస్తే.. అమ్మో..! ఆకాశాన్ని తాకుతుందని ఆశ్చర్యపోతాం కదా! ఇప్పుడు మేడిగడ్డ నుంచి గోదారమ్మను కూడా అంత ఎత్తుకు తీసుకొచ్చారు! సముద్ర మట్టం నుంచి మేడిగడ్డ 100 మీటర్ల ఎత్తులో ఉంది. సముద్ర మట్టం నుంచి కొండపోచమ్మ సాగర్‌ 624 మీటర్ల ఎత్తులో ఉంది! అంటే, మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ 524 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు!! ఇది అర కిలోమీటరు కంటే ఎక్కువన్నమాట! మరో మాటలో చెప్పుకోవాలంటే.. దాదాపు 175 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుంది! అంత ఎత్తుకు మేడిగడ్డ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలోని కొండ పోచమ్మ సాగర్‌కు నీటిని తీసుకొచ్చారన్నమాట! ఒక టీఎంసీ అంటే 2,832 కోట్ల లీటర్లు. పది వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లలో ఆ నీటిని నింపాలంటే, అక్షరాలా 26,32,000 ట్యాంకర్లు అవసరం. అటువంటిది 15 టీఎంసీలను అంత ఎత్తుకు ఎత్తిపోయడం అంటే మాటలా!! ఇటువంటి ప్రయత్నం ప్రపంచంలోనే ఇదే తొలిసారి! ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత! నాలుగేళ్లలోనే పూర్తి చేయడం మరో ఘనత. ఆకాశం నుంచి భూమి మీదకు నీటిని తీసుకు రావడం భగీరథ యత్నం! కానీ, భువి నుంచి దివికి నీటిని ఎత్తిపోయడమే చంద్రశేఖర యత్నం! ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాధించిన కొండంత విజయం!

 

 

ఏటా 80 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా.. తెలంగాణలో 199 కిలోమీటర్ల మేర గోదావరి సజీవంగా ఉండనుంది. కొత్తగా కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్‌, మేడ్చల్‌, పెద్దపల్లి జిల్లాల్లోని దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఇక, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్‌, మేడ్చల్‌, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మరో 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ కానుంది. వెరసి, తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు ఏటా రెండు పంటలకు నీరందుతుంది. అంటే, ఏటా 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. అందుకే, ఇది తెలంగాణకు వరప్రదాయిని.

 

మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకూ ప్రధానంగా పది ప్రాంతాల్లో నీటిని ఎత్తిపోస్తున్నారు. వీటిలో ప్రధానమైనవి ఏడు!

 

1  మేడిగడ్డ దగ్గర బరాజ్‌ నిర్మించి, గోదావరికి అడ్డుకట్ట వేశారు. ఆ నీటిని కన్నెపల్లి పంప్‌హౌజ్‌ ద్వారా ఆరు అంతస్తులు అంటే 21 మీటర్ల ఎత్తులోని అన్నారం బరాజ్‌లో పోశారు.

 

2  అన్నారం బరాజ్‌లో నిల్వ చేసిన నీటిని.. అక్కడి పంప్‌ హౌజ్‌ ద్వారా ఎత్తిపోసి 11 మీటర్ల ఎత్తులోని సుందిళ్ల బరాజ్‌కు తరలించారు.

 

3  సుందిళ్ల నుంచి నంది మేడారం 101 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే, దాదాపు 33 అంతస్తుల ఎత్తన్నమాట! అందుకే, తొలుత 16 మీటర్ల ఎత్తులోని ఎల్లంపల్లికి, అక్కడి నుంచి నంది మేడారానికి తీసుకొచ్చారు. ఈ నీటిని రామడుగులోని మహా బావిలో నిల్వ చేశారు.

 

4  రామడుగు నుంచి మిడ్‌మానేరు 87 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అందుకే, ఇక్కడ 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు మోటార్లను ఏర్పాటు చేశారు. అంటే, వాటి మొత్తం సామర్థ్యం 13 లక్షల హెచ్‌పీ పైమాటే! ఇన్ని మెగావాట్ల మోటారును ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి! ప్రపంచంలోనూ ఒకటో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి! ఇంత బలంగా నీటిని ఎత్తిపోసి దాదాపు 29 అంతస్తుల ఎత్తులోని ఎస్సారెస్పీ వరద కాల్వలో పోశారు. అక్కడి నుంచి మిడ్‌మానేరుకు తరలించారు.

 

5  మిడ్‌మానేరు నుంచి అనంతసాగర్‌ 77 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కేవలం గ్రావిటీ కెనాల్‌, టన్నెళ్ల ద్వారానే నీరు 25 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ అంత ఎత్తున్న అనంతసాగర్‌కు చేరింది. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోవచ్చు. భూగర్భంలో టన్నెళ్ల ద్వారా నీటిని పంప్‌ చేసి.. అనంతసాగర్‌ వద్ద ఎత్తిపోస్తున్నారు.

 

6  అనంతసాగర్‌ నుంచి రంగనాయక సాగర్‌ 83 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అందుకే, ఇక్కడ 106 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. ఇంత సామర్థ్యం కలిగిన మోటార్లు కూడా దేశంలో మరోచోట లేవని చెబుతున్నారు. వాటి నుంచి ఎత్తిపోసిన నీరు రంగనాయక సాగర్‌ పంప్‌హౌజ్‌కు చేరింది.

 

7  రంగనాయక సాగర్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌ 144 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఐదంతస్తులు కలిగిన 8 అపార్టుమెంట్లను ఒకదానిపై మరొకటి పేరిస్తే ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తన్నమాట! వాస్తవంగా ఇక్కడి నుంచి తొలుత 77 మీటర్ల ఎత్తులోని మల్లన్న సాగర్‌కు తరలించాలి. కానీ, అది ఇంకా పూర్తి కాలేదు కనక.. డైవర్షన్‌ కాల్వల ద్వారా నీటిని గజ్వేల్‌ మండలం అక్కారం, మర్కుక్‌లోని పంప్‌హౌజ్‌లకు తరలించారు. 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటార్ల ద్వారా 52 మీటర్ల ఎత్తులోని శ్రీగిరిపల్లికి నీరు చేరింది. అక్కడి నుంచి మర్కుక్‌ సర్జ్‌పూల్‌కు చేరాయి. అక్కడి పంప్‌హౌజ్‌లో 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటార్లు ద్వారా కొండపోచమ్మ సాగర్‌కు నీరు చేరనుంది.

 

కేసీఆర్‌ ఫాంహౌస్‌కు 5 కి.మీ. దూరంలోనే..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఉన్న సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోనే కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ ఉంది. దీంతో, అనతి కాలంలోనే సకల హంగులతో రిజర్వాయర్‌ నిర్మించేలా ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంత రైతుల భూములకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు పనుల గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రచించారు. కేసీఆర్‌ మానస పుత్రికగా రిజర్వాయర్‌ను వర్ణిస్తున్నారు.

 

కరువు ప్రాంతానికి ప్రయోజనం

కొండపోచమ్మ రిజర్వాయర్‌ ద్వారా కరువు ప్రాంతానికి సాగునీటిని ఇవ్వడానికి అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు నిర్మించిన అతి పెద్ద రిజర్వాయర్‌ ఇదే. దీని ద్వారా కరువు ప్రాంతాలైన మెదక్‌, సిద్దిపేట, మేడ్చల్‌, యాదాద్రి వంటి జిల్లాలకు ఏటా రెండు పంటలకు సాగునీరు అందుతుంది.

- హరిరాం, కాళేశ్వరం ఈఎన్‌సీ

 

తర్వాతి గమ్యం ఏమిటి!?

కొండపోచమ్మ రిజర్వాయర్‌ తర్వాత గోదావరి జలాలు చేరేది యాదాద్రి జిల్లాలోని బస్వాపూర్‌, గంధమల రిజర్వాయర్లకే. ఈ మేరకు హైలెవల్‌ మెయిన్‌ కెనాల్స్‌, డిస్ట్రిబ్యూటరీల పనులు తుది దశకు చేరాయి.

 

లబ్ధి పొందే జిల్లాలు: 1. కరీంనగర్‌ 2. సిరిసిల్ల 3. సిద్దిపేట 4. మెదక్‌ 5. యాదాద్రి 6. నల్లగొండ 7. సంగారెడ్డి 8. జగిత్యాల 9. నిజామాబాద్‌ 10. కామారెడ్డి 11. నిర్మల్‌ 12. మేడ్చల్‌ 13. పెద్దపల్లి 14. వరంగల్‌ అర్బన్‌ 15. వరంగల్‌ రూరల్‌ 16. భూపాలపల్లి 17. మహబూబాబాద్‌ 18. ఖమ్మం 19. జనగామ 20. సూర్యాపేట

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...