Jump to content

హైదరాబాద్‌లో ఉంటే వేరే దేశం నుంచి పరిపాలిస్తున్నట్లు అనిపిస్తోంది Cbn


ravula

Recommended Posts

మనం వెళ్లిపోవాలి.. తప్పదు
ప్రభుత్వం పట్టుదలగా ఉంది
మీరంతా సహకరించాలి
3000 మందికి గృహ వసతి
ఉద్యోగ నేతలతో చంద్రబాబు
హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించడం విదేశాల్లో ఉండి పాలన సాగిస్తున్నట్లు ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నవ్యాంధ్రకు వెళ్లిపోవాలని, ఈ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలకు స్ప ష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశాలు అపారమని సింగపూర్‌ ప్రతినిధి బృందానికి స్పష్టం చేశారు. ఆ బృందంతో సమావేశమై రాజధాని, అభివృద్ధిపై సమీక్షించారు. జూన్‌ ఏడో తేదీనాటికి కొన్ని కమిషనరేట్లు తాత్కాలిక రాజధానికి తరలిస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
హైదరాబాద్‌ నుంచి పాలన నాకే బాగాలేదు.. మనం వెళ్లిపోవాలి.. తప్పదు
ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది.. ఇందుకు మీరంతా సహకరించాలి
ఉద్యోగ నేతలకు చంద్రబాబు విజ్ఞప్తి.. ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరిస్తానని హామీ
3000 మందికి గృహ వసతి కల్పిస్తామని భరోసా.. వారం రోజుల్లో హెల్త్‌ కార్డుల సమస్యకు పరిష్కారం
సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణిస్తూ వెంటనే ఉత్తర్వులు.. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీతో చంద్రబాబు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌లో కూర్చుని పరిపాలన సాగించడం నాకే బాగా లేదు! ఇక్కడ ఉండి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించడం విదేశాల్లో ఉండి పరిపాలిస్తున్నట్లు ఉంది. ఇక్కడ ఉండి పాలన సాగిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. అది సరికాదు. మనం వెళ్లిపోవాలి. తప్పదు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పాలన సాగించడానికి మీరంతా నాకు సహకరించాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచే పాలన సాగించే విషయమై ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉందని, ఉద్యోగులు కూడా ఇందుకు సహకరించాలని స్పష్టం చేశారు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అశోక్‌బాబు, వెంకటేశ్వరరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కత్తి నరసింహారెడ్డి తదితరులు మంగళవారం రాత్రి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పీఆర్సీతోపాటు ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జూన్‌-జూలై నాటికి కొన్ని శాఖలను విజయవాడకు తరలిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ఇందుకు సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. అయితే, సరైన సౌకర్యాలు కల్పించకుండా శాఖలను తరలిస్తే తాము తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. వారి వాదనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకీభవించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, మౌలిక సదుపాయాలను నెమ్మది నెమ్మదిగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న రాజధాని ప్రాంతంలో మూడు వేలమంది ఉద్యోగులకు గృహాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబుతో సమావేశం తర్వాత ఆ వివరాలను జేఏసీ నేతలు అశోక్‌బాబు, వెంకటేశ్వరరావు తదితరులు విలేకర్లకు తెలిపారు. శాఖలను తరలించడం ద్వారా తలెత్తే సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చంద్రబాబు హమీ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల హెల్త్‌ కార్డులకు సంబంధించి వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. అలాగే, రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగులు చేసిన సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీనిపై గతంలోనే నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటి వరకు అమలు కాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల జీపీఎఫ్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ తదితర చెల్లింపులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికి, విజయవాడ, విశాఖ నగర పాలక సంస్థల్లో పని చేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పదవీ విరమణ వయసును కూడా 60 ఏళ్లకు పెంచడానికి చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. పీఆర్సీపై ఉద్యోగులతో వెంటనే చర్చించాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని ఆదేశిస్తామని సీఎం చెప్పారన్నారు.
పీఆర్సీ జాప్యంపై చంద్రబాబుకు ఫిర్యాదు
నేడు ముఖ్యమంత్రిని కలుస్తాం: మురళీకృష్ణ
హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పదో వేతన సవరణ అమలు విషయంలో జరుగుతున్న జాప్యంపై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత యు.మురళీకృష్ణ చెప్పారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పీఆర్సీతోపాటు ఉద్యోగుల విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నా.. కింది స్థాయిలో మాత్రం సరైన సహకారం లభించడం లేదని ఆరోపించారు. పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చి ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటి వరకు అమల్లోకి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల్లో పీఆర్సీని అమలు చేయాల్సి ఉన్నా.. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాము కూడా ఇప్పటి వరకు ఓపిక పట్టామని చెప్పారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...